రైతులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే తోట..
పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : మద్నూర్ మండలం చిన్న ఎక్లారా గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతుల పంట పొలాలు పూర్తిగా నీటమునిగి, తీవ్రనష్టంవాటిల్లింది. పంటలు నాశనం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హుటాహుటిన హైదరాబాద్ నుండి నియోజకవర్గానికి బయలుదేరారు. ప్రయాణమధ్యలోనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో అధికారులు వెంటనే పర్యటించి నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని, తక్షణ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు. ఆరుగాలం శ్రమించి అన్నం పెడుతున్న రైతన్నలు అకాల వర్షాల కారణంగా పంట నష్టం చవిచూస్తూ మనోవేదన చెందుతున్నారన్నారు. ఈ కష్టకాలంలో వారికి అండగా నిలబడి, ప్రభుత్వం తరఫున తగిన అందించడం బాధ్యత అని పేర్కొన్నారు.