logo

విజయనగరం: తుఫాను ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉన్నాం జెడ్‌పి చైర్మన్

భారీ తుఫానును ఎదుర్కొన‌డానికి జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉంద‌ని, జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి అధికారుల‌ను ఇప్ప‌టికే అప్ర‌మ‌త్తం చేసి, అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను తీసుకున్నార‌ని ఆయ‌న వెళ్ల‌డించారు. జెడ్‌పి స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, సిఎం నిరంత‌రం అధికారుల‌తో, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ, తుఫాను ప్ర‌భావాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని చెప్పారు. తీర‌ప్రాంతంలో హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డ‌మే కాకుండా, ఎటువంటి ప‌రిస్థితి త‌లెత్తినా ఎదుర్కొనేందుకు ఎన్‌డిఆర్ఎఫ్‌, ఎస్‌డిఆర్ఎఫ్ ద‌ళాల‌ను సిద్దంగా ఉంచార‌ని తెలిపారు.
వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల‌ను బ‌ట్టి మిఛాంగ్ తుఫాను ప్ర‌భావం మ‌న జిల్లాపై పెద్ద‌గా ఉండే అవ‌కాశం లేద‌న్నారు. అయితే భారీ వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చ‌న్న సూచ‌న‌లు మాత్రం ఉన్నాయ‌ని, కోత‌కొచ్చిన వ‌రిపంట న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉన్నందున‌ రైతులు త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని కోరారు. తడిచిపోయిన ధాన్యాన్ని కూడా ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని, రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ధాన్యాన్ని ఆఫ్‌లైన్లో అయినా కొనుగోలు చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆదేశాల‌ను జారీ చేసింద‌ని తెలిపారు. రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జ‌రుగుతోంద‌ని, రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. ఒక ప్ర‌ముఖ ప‌త్రిక‌లో త‌న‌ను ఉద్దేశిస్తూ ప‌రోక్షంగా రాసిన వార్త త‌ప్పుడు క‌థ‌న‌మ‌ని, దురుద్దేశంతో కుట్ర పూరితంగా దానిని ప్ర‌చురించార‌ని ఈ సంద‌ర్భంగా జెడ్‌పి ఛైర్మ‌న్ పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనువాసుల నాయుడు, అంబళ్ళ శ్రీరాముల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

0
1294 views