logo

ఈ-ఆఫీస్‌ అప్‌ గ్రేడ్‌ ముసుగులో రికార్డులు గల్లంతు తక్షణం నిలుపదల చేయాలి కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్‌


ఆకర్ష్ అనకాపల్లి : ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ప్రస్తుత వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా ‘ఈ-ఆఫీస్‌ వెర్షన్‌ అప్‌ గ్రేడ్‌’ ముసుగులో సేవలు నిలిపివేయడం తగదని పబ్లిక్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ కాండ్రేగుల వెంకటరమణ పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్‌ పేరుతో ఈ-ఆఫీస్‌ను ప్రభుత్వం మూసివేస్తుందని, దీనివల్ల అక్రమాలు జరిగే వీలుందన్నారు. ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు గల్లంతయ్యాయని, రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వ వెబ్‌సైట్‌ (www.apegazette.cgg.gov.in, www.goir.ap.gov.in)లలో ప్రభుత్వ ఉత్తర్వులు పూర్తి స్ధాయిలో పెట్టకపోవడం బట్టి పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. గత 5 ఏళ్లలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లలో పూర్తి స్ధాయిలో పెట్టకుండా ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ-ఆఫీస్‌ వెర్షన్‌ మార్పు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు. అన్ని హెచ్‌వోడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న చోట పరిశీలన చేయాలని, ఫిజికల్‌ డాక్యుమెంట్లు, డిజిటల్‌ డాక్యుమెంట్లు, అన్ని ఫైళ్లు, నోట్‌ ఫైళ్లు, రికార్డులు మాయం కాకుండా భద్రపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలని వెంకటరమణ కోరారు. కొద్దిరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సీఐడీ కాల్చివేయడం, ప్రభుత్వ రికార్డుల మాయం ఆరోపణలపై ఫిర్యాదులందినా ఎలాంటి చర్యలు లేని నేపధ్యంలో తక్షణం ఈ-ఆఫీస్‌ వెర్షన్‌ అప్‌ గ్రేడ్‌ను నిలుపదల చేసేలా ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ను కాండ్రేగుల వెంకటరమణ కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు. కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు ఫించన్ల మంత్రిత్వ శాఖకు ఈ-మెయిల్‌ లేఖలు పంపారు.

3
435 views