logo

వైవిధ్య భ‌రితంగా కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న‌

విజయనగరం:- విజ‌య‌న‌గ‌ర ఉత్స‌వాల‌ను ఈ ఏడాది అక్టోబ‌రులో రెండు రోజుల‌పాటు నిర్వ‌హించాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. అక్టోబ‌రు నెల 12న విజ‌య‌ద‌శ‌మి వ‌చ్చినందున 15న శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం జ‌రుగ‌నున్నందున‌ 13, 14 తేదీల్లో మాత్ర‌మే ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల ఈ రెండు రోజుల్లోనే కార్య‌క్ర‌మాలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాల్సి వుంద‌ని ప్రాథ‌మికంగా ఒక అంచ‌నాకు వ‌చ్చారు. ఈ ఏడాది విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ప్రాథ‌మిక స్థాయిలో ఒక అవ‌గాహ‌న కోసం జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్, స్థానిక శాస‌న‌స‌భ్యురాలు అదితి గ‌జ‌ప‌తిరాజు జిల్లా అధికారుల‌తో కోట‌లో సోమ‌వారం సాయంత్రం స‌మావేశ‌మై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గ‌త ఏడాది నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూనే ప్ర‌జ‌ల‌కు వినోదం పంచే, ఆక‌ర్షించే విధంగా మ‌రికొన్ని వైవిధ్య భ‌రిత‌మైన కార్య‌క్ర‌మాల‌ను ఈ ఏడాది కొత్త‌గా చేప‌ట్టాల్సి వుంద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. విజ‌య‌న‌గ‌రం చ‌రిత్ర‌ను తెలిపేలా లేజ‌ర్ షో, డ్రోన్ షో, హెలికాప్ట‌ర్ ద్వారా న‌గ‌ర వీక్ష‌ణం, రాష్ట్ర స్థాయి క్రీడ‌ల పోటీల నిర్వ‌హ‌ణ వంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల్సి వుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అధికారుల‌కు సూచించారు. అదేవిధంగా కోట చుట్టూ వున్న ప్రాంతాన్ని సుంద‌రీక‌ర‌ణ చేప‌ట్టాల్సి వుంద‌ని సూచించారు వి.ఎం.ఆర్‌.డి.ఏ ఆధ్వ‌ర్యంలో కోట చుట్టూ గార్డెనింగ్ చేప‌ట్టి అమ్మ‌వారి పండుగ స‌మ‌యానికి అత్యంత సుంద‌రంగా తీర్చిదిద్దేలా ప్రాజెక్టు రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. గ‌త ఏడాది త‌ర‌హాలో జాతీయ స్థాయి డ్వాక్రా ఉత్ప‌త్తుల విక్ర‌యాల‌కు సంబంధించి స‌ర‌స్ ఎగ్జిబిష‌న్ నిర్వ‌హ‌ణ‌, ఫ్ల‌వ‌ర్ షో, స్థానిక క‌ళ‌ల‌ను ప్రోత్స‌హిస్తూ ఇక్క‌డి క‌ళాకారుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసేందుకు గ‌తంలో మాదిరిగానే కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌న్నారు.
క‌లెక్ట‌ర్ వెంట డి.ఆర్‌.ఓ. ఎస్‌.డి.అనిత‌, జిల్లా ముఖ్య ప్ర‌ణాళిక అధికారి పి.బాలాజీ, డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, జిల్లా ప‌ర్యాట‌క అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ‌, డి.ఎస్‌.డి.ఓ వెంక‌టేశ్వ‌ర‌రావు, త‌హ‌శీల్దార్ కూర్మ‌నాధ‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

26
4616 views