
కేజీహెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
*ఓపీ సేవలపై, సిబ్బంది సహకారంపై ఆరా రోగులతో మాటామంతీ*
విశాఖపట్టణం
09 ఏప్రిల్ 2025
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ కింగ్ జార్జి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం తన కార్యాలయానికి వచ్చే క్రమంలో ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఓపీ కౌంటర్ల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. హెల్ప్ డెస్కు పనితీరు, కౌంటర్ల వద్ద సదుపాయాల స్థితిగతులను గమనించారు. అభ యాప్ ద్వారా ఓపీ టికెట్ తీసుకునే విధానం, రోగులకు వైద్యులు, సిబ్బంది నుంచి అందుతున్న సహకారంపై ఆరా తీశారు. వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన పలువురు రోగులతో కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఓపీ తీసుకునేందుకు ఎంత సేపు నిరీక్షిస్తున్నారు.. హెల్ప్ డెస్కులో ఉన్నవారు పూర్తి సహకారం అందిస్తున్నారా లేదా అనే అంశాలపై రోగులతో మాట్లాడారు. సిబ్బంది వ్యవహార శైలి, సదుపాయాలు, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సమయంలో ఆయన వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. కె. శివానంద, ఆర్.ఎం.వో. డా. మెహర్ కుమార్ ఉన్నారు. రోగులకు అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ కు వివరించారు.