స్వర నీరాజనాలు అర్పించిన స్వరబృందావనం 15 వ సంగీత విభావరి ( మెగా ఈవెంట్)
13.04.2025 తేదీన "స్వర బృందావనం" రథ సారథులు శ్రీ రవికాంత్, శ్రీ కుమార్ ల ఆధ్వర్యం లో "కళాభారతి సిటీ కల్చరల్ సెంటర్" హైదరాబాద్ లో నిర్వహింపబడిన 15 వ సంగీత విభావరి 2 వ మెగా ఈవెంట్ గా "మళ్లీ మళ్లీ వినాలి" అనిపించేంత అత్యద్భుతంగా ప్రదర్శింపబడి ప్రేక్షకులచే "శభాష్" అనిపింపజేసింది.
"స్వర బృందావనం" అత్యద్భుత గాయనీగాయకుల గానానికి ముగ్ధులైన సంగీతాభిమానులు, కళాభిమానులు ఈ మెగా ఈవెంట్ ను కూడా ప్రోత్సహిస్తూ తమ ఆర్థిక హార్దిక సహాయ సహకారాలను హృదయపూర్వకంగా అందజేశారు. శ్రీ కొచ్చెర్ల రఘు బాబు గారు వారి తండ్రిగారు కీ.శే. శ్రీ కొచ్చెర్ల నరసింగరావు గారి జ్ఞాపకంగా ఈవెంట్ కు హాజరైన అందరికీ భోజనాలు, మెమొంటోలు ఏర్పాటు చేశారు. గాయనీగాయకులందరు నరసింగరావు గారికి హృదయాంజలి ఘటించి తమ స్వర నీరాజనాలు అందజేశారు.. అలాగే "శ్రీకర్ ఓల్డేజ్ హోమ్ & హోమ్ కేర్" వ్యవస్థాపకులు శ్రీ బల్లా శ్రీ హరి గారు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ గొప్ప హృదయాన్ని చాటుకొన్నారు.
స్వర బృందావనం సంగీత విభావరులకు ముగ్ధులైన గాయనీ గాయకులు కూడా భువనేశ్వర్, విశాఖపట్నం, అనంతపురం, ఏలూరు, నల్గొండ, షాద్ నగర్ మొదలైన సుదూర ప్రాంతాలనుండి వచ్చి ఈ మెగా ఈవెంట్ లో పాల్గొని ప్రేక్షకులను తమ గాన మాధుర్యంతో అలరించారు. "ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ "శ్రీ దీపక్ గారు కూడా"గుర్ గావ్" నుంచి వచ్చి ఈ మెగా ఈవెంట్ లో అనేక హిందీ పాటలతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. హైదరాబాద్ వారే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయనీ గాయకులందరు కూడా తమ అత్యద్భుతమైన కంఠస్వరంతో, చక్కటి వినసొంపైన పాతకొత్తల మేలికలయిక పాటలతో ప్రత్యక్ష పరోక్ష వీక్షకులందరినీ అలరింపజేసి "శభాష్, మళ్లీ మళ్లీ వినాలి" అనిపించేలా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం లో శ్రీ బృందావనం రవికాంత్ , శ్రీ తూములూరి శ్రీకుమార్ , శ్రీ కొచ్చెర్ల రఘుబాబు , శ్రీ విజయరాఘవన్, శ్రీ చలపతి, శ్రీ ఓబుళదాస్, శ్రీ ఆది శేషు, శ్రీ రాంబాబు, శ్రీ చైతన్య, శ్రీ వెంకటాచలం, శ్రీ రాజకుమార్, శ్రీ దీపక్, శ్రీ కౌకుంట్ల లక్ష్మణచార్యులు, బ్రహ్మానందం, శ్రీ నాగేశ్వరరావు...
శ్రీమతి సీత, శ్రీమతి సీతకుమారి, శ్రీమతి దాము రాజేశ్వరి, శ్రీమతి శ్రీమణి, శ్రీమతి శ్రీరాణి, శ్రీమతి శైలజ, శ్రీమతి శైలజనాయుడు, శ్రీమతి ఊర్మిళ, శ్రీమతి యశోద, శ్రీమతి నిర్మాలకిషోర్, శ్రీమతి వెంపటి రమాదేవి శ్రీమతి సమీరా తదితరులు తమ అద్భుతాగానం తో అలరించారు.
రఘు బాబు గారి ప్రార్థన శ్లోకం తోను, చలపతి గారి వినాయక ప్రార్ధన తోను మొదలైన ఈ కార్యక్రమం ఏలూరు నుంచి వచ్చిన బ్రహ్మానందం గారి "అంతయు నీవే హరి పుండరీకాక్ష" అనే అన్నమాచార్య కీర్తనతో తారాస్థాయికి చేరింది. "వేదం అణువణువున నాదం" అంటూ రవికాంత్ ఊర్మిళ గార్లు, "స్వర రాగ గంగా ప్రవాహమే" అంటూ రఘు బాబు గారు, "హృదయమే" (కన్నడ) అంటూ రాజ్ కుమార్ శ్రీమణి గార్లు, "కభీ కభీ" (హిందీ) అంటూ దీపక్ రాజ్ కుమార్ గార్లు, "తనువా హరి చందనమే" అంటూ శ్రీ కుమార్ శైలజానాయుడు గార్లు, "నాద వినోదము" అంటూ రవికాంత్ రమాదేవి గార్లు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యద్భుతంగా సాగిన ఈ మెగా ఈవెంట్ గాయనీగాయకులకు గాని, ప్రత్యక్ష పరోక్ష వీక్షకులకు గాని ఏమాత్రము అలసట విసుగు కలిగించకుండా "మళ్లీ మళ్లీ వినాలి" ఇంకా సాగాలి అని అందరూ అనుకున్నారు. ఈ భావాలను ప్రేక్షకులు తమ తమ కామెంట్స్ తో తెలియజేశారు.
రవికాంత్ గారి యాంకరింగ్, గానం, కార్యక్రమ నిర్వహణ లకు మిక్కిలి ముగ్ధులైన ఇతర ప్రాంతపు గాయనీ గాయకులు తమ ప్రాంతాల్లో కూడా అంటే అనంతపురం, రాజమహేంద్రవరం,విజయవాడ, విశాఖపట్నాలలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసినదిగా "స్వర బృందావనం" నిర్వాహకులు "రవికాంత్ శ్రీ కుమార్" (రవిశ్రీ) గార్లను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అక్కడ నిర్వహించే ఈ కార్యక్రమాలకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ మెగా ఈవెంట్ గురించి ఇంకా వ్రాయవలసినవి ఉన్నా స్థలాభావం చేత వ్రాయబడలేదు. తరువాత ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమానికి తమ వ్యక్తిగత కారణాల చేత రాలేకపోయిన "స్వర బృందావనం" ఆస్థాన గాయనీ గాయకులు శ్రీ శరత్ కృష్ణ, శ్రీమతి శారద , శ్రీమతి బాదం కుమారి, శ్రీ సుబ్బారామన్ ఇంకా ఇతర ప్రభృతులు తాము పాల్గొనలేకపోయిన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ, నిర్వాహకులు రవికాంత్ శ్రీ కుమార్ గార్లకు కార్యక్రమం అత్యద్భుతంగా రక్తి కట్టాలనే తమ ఆకాంక్షను ఆశీస్సులను అందజేస్తూ, గాయనీ గాయకులకు తమ అభినందనలు అందజేశారు.