logo

PM Modi Ji

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ రాజధాని అమరావతిలో శుక్రవారం నాడు పర్యటించనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అమరావతి: అమరావతి పున: ప్రారంభ పనులకు రేపు(మే 2) ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. రాజధానికి తరలివచ్చే ప్రజల కోసం రవాణా వసతి కల్పిస్తుంది. ఇందుకోసం 8 వేల బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాల నుంచి భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. ఈ 8 జిల్లాలకు మొత్తం 6,600 బస్సులు కేటాయించింది. మిగిలిన జిల్లాల్లోని 120 నియోజకవర్గాలకు 1400 బస్సులు ఏర్పాటు చేసింది. ఇవాళ(గురువారం) రాత్రికి సంబంధిత గ్రామాలకు బస్సులు చేరుకోనున్నాయి.


ఒక్కో బస్సుకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇన్‌చార్జిగా ప్రభుత్వం నియమించింది. సభకు జనాలను తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత ఇన్‌ఛార్జులకు అప్పగించింది. ఏర్పాట్ల పర్యవేక్షణకు మండలానికి ఒక ఇన్‌ఛార్జికి బాధ్యతలు అప్పగించింది. బస్సులు రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక చేశారు. రాజధానికి వెళ్లే ప్రజలకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. వేసవి దృష్ట్యా సభకు వచ్చే ప్రజలకు మజ్జిగ, ఓఆర్ఎస్, పండ్లు పంపిణీ చేయనుంది. జిల్లాల పౌరసరఫరాల శాఖాధికారులకు ఆహారం సరఫరా బాధ్యత అప్పగించింది. సభకు వచ్చే మార్గాల్లో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. సభా గ్యాలరీల్లోనూ ఆరుగురు సిబ్బందితో కూడిన వైద్య బృందాన్ని ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.

83
17506 views