logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్-"పకృతి పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమం".....

తేది 28-07-2025, శేర్లింగంపల్లి చందానగర్: ఈ రోజ ఉదయం కొండాపూర్ లో గల శారదా హైస్కూల్ నందు పకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయివ రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బందా నరేంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య G. కిషోర్ కుమార్ గారు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ (సెంటర్ ఫర్ ఎర్త్, స్పేస్ సైన్స్ అండ్ ఓసియన్) విచ్చేసి మాట్లాడుతూ *"సకల జీవరాసుల మనుగడకు మూలాధారం పంచ భూతాలైన భూమి, గాలి, నీరు, నింగి మరియు నిప్పులను పకృతే ఈ విశ్వానికి అందించింది. పంచ భూతాల నిష్పత్తిలో సమతుల్యత లోపించిన మానవ జీవనం అస్తవ్యస్తమవడంతో పాటు విపత్తులకు గురి అవుతుంది. ప్రకృతి, వాతావరణ, పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అవసరం. ఆధునీకరణ, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, శీఘ్రముగా విస్తరిస్తున్న కార్పొరేటీకరణ శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంభవిస్తున్న పరిణామాలు, మానవుని స్వార్థ పరత్వం పకృతి విధ్వంసం దిశగా కొనసాగడం శోచనీయం"* అని అన్నారు. " *మానవుడు తన భౌతిక అవసరాల కోసం తరతరాల ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. ఈ విధమైన తన స్వార్థ పూరిత చర్యలు భవిష్యత్తు తరాలకు శాపంగా పరిణమించే ప్రమాదాన్ని గుర్తించక పోవడం బాధాకరం. 19వ శతాబ్దం నుండి మానవ తప్పిదాల వలన ప్రకృతి విధ్వంసానికి గురి అవుతుంది. ప్రకృతిలో మానవుడు తప్ప మిగతా జీవరాసులు ప్రకృతి చెప్పినట్లు ప్రవర్తిస్తున్నాయి. ప్రకృతికి భిన్నంగా నడిచి మానవుడు చేసే ప్రతికూల చర్యల వలన ఏ పాపం యెరుగని మూగ జీవాలు మూల్యం చెల్లించవలసి వస్తుంది. మానవుడు శాస్త్ర సాంకేతిక మరియు జీవావరణ రంగాలలో సాధించిన ప్రగతి వల్ల కలిగిన మార్పులు మాత్రము ప్రకృతి స్వచ్ఛతకు, ఉనికికి ముప్పుగా పరిణమించాయి. వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా వినియోగించిన రసాయనిక ఎరువులు మరియు క్రిమిసంహారక మందుల ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఓజోన్ పొరలో ఏర్పడిన రంధ్రాలు రానురాను విస్తరిస్తున్నాయి. వీటికి తోడు పట్టణీకరణ, పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల, రియల్ ఎస్టేట్ వ్యాపారము, అడవుల నరికివేత, సహజ వనరుల విధ్వంసం, ఇసుక మాఫియా, మితిమీరిన ప్లాస్టిక్ వాడకం ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. అభివృద్ధి పేరిట భారీ ప్రాజెక్టులను, కాలుష్య కారక పరిశ్రమలను స్థాపిస్తూ పర్యావరణ, జీవావరణ, ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం వలన అధికసంఖ్యలో వృక్షజాతులు, జంతుజాతులు అంతరించి పోతున్నాయి. మానవుడు ఉన్నన్ని రోజులు ప్రకృతి వనరులను పరిమితంగా ఉపయోగించుకొని తరువాతి భవిష్యత్తు తరానికి అందించాలి. ఇది వారసత్వ సంపద. భావి తరాల వారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలను కానుకగా ఇస్తున్నాము. విచక్షణా రహితంగా అటవీ సంపదను ధ్వంసం చేయడం వలన 33℅ ఉండవలసిన అడవులు నేడు 21℅ మించి లేవు. దీని వలన పకృతి విపత్తులు, అకాల వర్షాలు, వరదలు వచ్చి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. మానవుని చర్యల వలన గాలి కాలుష్యమవుతుంది. తద్వారా యేటా 70 లక్షల మంది మృత్యువు వాత పడుతున్నారని WHO నివేదికలు తెలియజేస్తున్నాయి. కలుషితమైన నీరు త్రాగి యేటా 2 లక్షల మంది చనిపోతున్నారు నీతి ఆయోగ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల విస్తరణ వలన 85℅ చిత్తడి నేలలను ప్రపంచం కోల్పోయింది. 75℅ భూ ఉపరితల మార్పునకు లోనైంది. 66℅ సముద్ర విస్తీర్ణం ప్రభావితమైందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పంటల దిగుబడిలో కీలకపాత్ర పోషించే తేనెటీగలు, ఊర పిచ్చుకలు అంతరించి పోతున్నాయి. ప్రకృతి విధ్వంసం యిలాగే కొనసాగితే ప్రపంచంలోని ప్రతి నాలుగు జీవ జాతులలో ఒకటి అంతరించిపోయే ప్రమాదం ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి. మానవుడు తన మేథస్సు ద్వారా అనేక పరిశోధనలు చేసి ఎంతో ప్రగతి, పురోగతి సాధించాడు. సాధించిన ప్రగతి ప్రకృతి, పర్యావరణ వినాశకరంగా పరిణమించింది. దీనివలన ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఋతువులు గతి మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుతున్నాయి. వరదలు, తుఫానులు, భూ కంపనాలు, అగ్ని పర్వతాలు, సునామీలు మానవజాతిని మిక్కిలి భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కరోనా లాంటి ప్రాణాంతక వైరసులు సులువుగా విజృంభించి మానవజాతిని మృత్యు కుహరంలోకి నెట్టినప్పటికీ ప్రకృతి విధ్వంసాన్ని అదుపుచేయకపోవడం బాధాకరం. ఈ సృష్టిలోని సకల జీవరాసుల మనుగడ ప్రకృతిపై ఆధారపడి ఉంది కాబట్టి పరిరక్షణ అనేది మన అందరి సామాజిక బాధ్యత. పరిరక్షణ చర్యలలోని భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి, సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహించాలి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా సౌరశక్తి, పవన శక్తి, జలవిద్యుత్తును అధికంగా అందుబాటులోనికి తేవాలి. ప్రకృతి పరిరక్షణకు RRR (Reduce, Reuse and Recycling) పద్దతులు మన జీవితంలో భాగం కావాలి. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు నిర్మించాలి. గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. విరివిగా మొక్కలు నాటి అటవీ విస్తీర్ణతను పెంచాలి. భూమి కోతకు గురికాకుండా చర్యలు చేపట్టాలి. భూ సారాన్ని రక్షించాలి. చిత్తడి నేలల రక్షణకై చర్యలు చేపట్టాలి. జల కాలుష్యాన్ని నివారించాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. భూగర్భ జలాలను సంరక్షించుకోవడం వంటి చర్యలు చేపట్టి ప్రకృతిని సంరక్షించునే బాధ్యత పౌర సమాజంపై ఉంది"* అని అన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తానని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీను, బాలరాజు,కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

138
8898 views