logo

అద్భుతంగా వెలుగొందిన "స్వర బృందావనం" 21 మరియు 22 వ సినీ సంగీత విభావరులు.

26.07.2025 న ప్రముఖ బ్యానర్ "స్వర బృందావనం" తన 21 వ సినీ సంగీత విభావరి ని ప్రదర్శించింది. వ్యవస్థాపకులు శ్రీ రవికాంత్ మరియు శ్రీ కుమార్ ల ఆధ్వర్యాన రెట్రో రాగాస్ నిజాంపేట స్టూడియో లో ఒక ప్రత్యేక "పురుష ప్రధాన" (Male special) మైన కార్యక్రమం గా రూపు దిద్దుకుంది.
రెట్రో రాగాస్ అధినేత శ్రీ మూర్తి గారి అపూర్వ సహకారంతో శ్రీయుతులు రవికాంత్, శ్రీ కుమార్, రఘుబాబు (విశాఖపట్నం వాస్తవ్యులు) అద్భుతమైన పాటలను తమ గాన మాధుర్యంతో ఆలపించి కార్యక్రమాన్ని ప్రభావవంతంగా వెలుగొందించారు.
"ఏక దంతాయ వక్ర తుండాయ" అనే రవికాంత్ గణపతి ప్రార్థన తో ప్రారంభమైన ఈ 21 వ సినీ సంగీత విభావరి ఉదయం 11 గంటల కు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్విరామంగా సాగి, ప్రేక్షకుల నుర్రూతలూగించింది. పాల్గొన్నది ముగ్గురే అయినా అద్వితీయమైన "ప్రణామం ప్రణామం, అంజలీ అంజలీ పుష్పాంజలి, రాగం తానం పల్లవి, ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి, ఆమని పాడవే, పున్నమి రాత్రి" మొదలైన ప్రజా రంజకమైన పాటలతో ఎక్కడా విసుగు చెందనీయకుండా అజరామరం చేశారు.
తరువాత వెంటనే అనగా మరునాడే 27.07.2025 న సిటీ కల్చరల్ సెంటర్ హైదరాబాదు స్టూడియో లో రవికాంత్ "స్వర బృందావనం" 17 మంది గాయనీ గాయకుల అద్భుతమైన పాటలతో 22 వ సంగీత విభావరి గా తన విశ్వరూపం ప్రదర్శించింది.
ముందుగా రవికాంత్ గణపతి ప్రార్థన చేయగా గాయనీమణులు గాయకశ్రేష్ఠులు తమ సత్తా అద్భుతంగా చాటారు.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సాగిన ఈ 22 వ సినీ సంగీత విభావరి లో గాయనీ గాయక శిఖామణులు "స్వప్న వేణువేదో, తెల్ల చీరకు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కరగిపోయాను కర్పూర వీణ లా, వయసే ఒక పూలతోట, అందెల రవమిది, గువ్వా గోరింకతో, రవివర్మ కే అందని, ముద్దబంతి నవ్వులో మొదలైన సభ్యతాయుతమైన మేలిరకపు పాటలతో అలరించారు.
అతిథి సత్కారం అలవాటైన రవికాంత్ ఈసారి గాయనీ గాయక బృందానికి, సాంకేతిక బృందానికి భోజన కార్యక్రమం ఏర్పాటుచేసి "అన్నదాతా సుఖీభవ" అని ఆశీర్వదింపబడ్డారు. బ్యానర్ అంటే "స్వర బృందావనం" అని కీర్తి సంపాదించిన రవికాంత్ తన ఉన్నతికి కారకులైన ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకుల కు తనకెవరూ Chief guestes లేరని, గాయనీ గాయక శిఖామణులు, ప్రోత్సాహక ప్రేక్షకులే ముఖ్యమైన వారని, వినమ్రంగా తెలిపారు.
ఈ కార్యక్రమం లో శ్రీయుతులు రవికాంత్, శ్రీ కుమార్, రాంబాబు, విజయ రాఘవన్, సీతాపతి శర్మ, రవికుమార్, వెంకట ప్రసాద్, రఘుబాబు (విశాఖపట్నం), వేదవ్యాస్ ప్రభృతులు, మరియు శ్రీమతులు సీత, సీతాకుమారి, శారద, ఎమ్.ఎస్.లక్ష్మి, సవితశ్రీ, యశోద, సమీర, వసుధ ప్రభృతులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
క్రమశిక్షణాయుతమైన, ఆనందకరమైన ఈ కార్యక్రమం జనగణమన తో విజయవంతంగా ముగిసింది.

58
1665 views