
శ్రీకాకుళంలో అధ్వానంగా పారిశుధ్యం ....
కాలువల్లో పేరుకుపోతున్న పూడిక
రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు
జిల్లా కేంద్రంలోనే అపరిశుభ్రత
వర్షం వస్తే ఇక్కట్లు అన్నీఇన్నీ కావు
శ్రీకాకుళం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుంది శ్రీకాకుళం నగర పాలక సంస్థ దుస్థితి. మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా పదేళ్ల కిందట అప్‌గ్రేడ్ చెందినా.. వసతులు మాత్రం మెరుగుపడలేదు. సమస్యలు పరిష్కారం కావడం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం శ్రీకాకుళం నగరంలో లక్షమందికిపైగా జనాభా ఉన్నారు. ఈ పద్నాలుగేళ్లలో జనాభా రెట్టింపు అయ్యారు. కానీ ప్రజల అవసరాలకు తగ్గట్టు వసతులు లేవు. ముఖ్యంగా పారిశుధ్యం నిర్వహణ దారుణంగా ఉంది. దశాబ్దాల కిందట నాటి డ్రైనేజీ వ్యవస్థ కొనసాగుతోంది. మురుగు కాలువలు, వాటి మదుములు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో మురుగునీటి ప్రవాహం సరిగ్గా సాగడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఖాళీ సీసాలు, చెత్త పేరుకుపోయి ఎక్కడికక్కడ మురుగునీరు కాలువలపై నుంచి రోడ్లపైకి వస్తోంది. దీంతో నగరవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే పాలన నడవాలి. తరచూ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై పర్యవేక్షించాలి. కానీ ఆయన ప్రత్యేకాధికారిగా ఉన్న నగరం ఇలా అపరిశుభ్రంగా తయారు కావడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే నగరం నుంచి ఎమ్మెల్యేగా గొండు శంకర్ ఉన్నారు. ఆయన కూడా తరచూ నగరంలో తిరుతుంటారు. తమ కష్టాలు ఎమ్మెల్యే అయినా పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎక్కడ చూసినా.. అదే దుస్థితి
శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్, మిర్తిబట్టి, పాలకొండ రోడ్డు, ప్రధాన మెయిన్‌రోడ్డు, డేఅండ్‌నైట్ జంక్షన్, అరసవల్లి రోడ్డు, 80అడుగుల రోడ్డు, రామలక్ష్మణ జంక్షన్, ఇలా 14 ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోతోంది. దీంతో చిన్న వర్షం పడినా మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎప్పుడూ వర్షపు నీరు నిలిచిపోతుంటుంది. కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు మురుగునీరు ప్రవాహానికి ప్రతిబంధకాలుగా మారాయి. అలాగే నీలమ్మకాలనీ నుంచి తోటపాలెం వెళ్లే రోడ్డులో మురుగు కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే రోడ్డులో కూడా కాలువ సరిగా లేక.. రోడ్డుపై మురుగునీరు నిలిచిపోతోంది. కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద కాలువ నుంచి మురుగునీరు.. రోడ్డుపై ప్రవహించి గుంతల్లో చేరుతోంది. శాంతినగర్ కాలనీలోనూ ఇదే పరిస్థితి. ఇలా నగరంలో ఏ వీధి చూసినా ఇదే దుస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడూ కాలువల్లో ఉన్న చెత్తాచెదారాలు తొలగిస్తున్నారు. కానీ వారం రోజుల తర్వాత పరిస్థితి షరామామూలుగానే మారుతోందని నగర ప్రజలు వాపోతున్నారు.
పూర్తికాని శుద్ధిప్లాంట్...
శ్రీకాకుళంలో అన్ని ప్రాంతాల కాలువల నుంచి నాగావళి నదిలోకి మురుగు కలుస్తుంది. దీనితో నది కాలుష్యం తగ్గించేందుకు రూ.36కోట్లతో కొన్నేళ్ల కిందట సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ) పనులు ప్రారంభించారు. కాలువల నుంచి వచ్చే మురుగునీటిని ఎస్‌టీపీలోకి చేర్చి అక్కడ ఆ నీటిని శుద్ధి చేసి అనంతరం నాగావళి నదిలోకి వదిలేందుకు ప్రణాళిక రచించారు. అమృత్ నిధులతో చేపట్టిన ఈ పనులు ఏడాది నుంచి నిలిపేశారు. దీనితో మురుగు నేరుగా నదిలోకి కలుస్తోంది. ఇప్పటికైనా ఎస్‌టీపీ పనులు పూర్తి చేయాలని, ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న కాలువల్లో పూడిక తొలగించాలని నగర ప్రజలు కోరుతున్నారు. పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.