logo

సిక్కోలు వజ్రోత్సవం

శ్రీకాకుళం: శ్రీకాకుళం అంటేనే అన్ని ప్రాంతాల సమాహారం. 193 కిలోమీటర్ల సుదీర్ఘ మైన తీరప్రాంతం... రూ.కోట్లలో విలువచేసే ఖనిజ సంపద... పచ్చని కొండలు.. సుదూరమైన జాతీయరహదారి.. ఇవన్నీ జిల్లాకు ఆభరణాలు. మరోవైపు పర్యాటక అందాలకు నెలవు సిక్కోలు. ఇంకోవైపు అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఫరిడవిల్లుతున్నాయి. శాలిహుండం, దంతపురి, పాండవుల మెట్ట, జగతిమెట్టవంటి పర్యాటక ప్రాంతాలు ఇక్కడ నెలవు. వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయా వంటి నదులు ప్రవహించే నేల ఇది. ఉద్యమాలకు పుట్టినిల్లుగా పేరొందింది. స్వాతంత్ర సమరయోధులు, రాజకీయవేత్తలు, రంగస్థల కళాకారులు వంటి ఎందరో ప్రముఖులు జన్మించిన పుణ్యస్థలం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సిక్కోలు ఏడున్నర దశాబ్దాలుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటూ.. అభివృద్ధి దిశగా పయనిస్తోంది.

జిల్లా ఆవిర్భావం ఇలా..

శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15న ఆవిర్భవించింది. అప్పటివరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌గా ఉండేది. తర్వాత 11 తాలుకాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 18 అసెంబ్లీ నియోజకవర్గాలతో శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. 1960లో ప్రస్తుత జిల్లా పరిషత్‌గా పిలిచే జిల్లా బోర్డు ఏర్పాటైంది. 1969లో జిల్లా విభజన జరిగింది. బొబ్బిలి, సాలూరు తాలుకాల్లోని 107 గ్రామాలను విభజించి గజపతినగరం తాలుకాగా ఏర్పాటు చేశారు. 1979లో సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం తాలుకాలు వేరుపడి.. విశాఖలో ఉన్న విజయనగరం తాలుకాతో కలిపి.. విజయనగరం జిల్లా ఏర్పాటైంది. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సమితి వ్యవస్థ రద్దయింది. వాటి స్థానంలో 37 మండలాలు ఏర్పాటయ్యాయి. 1999లో చివరిసారిగా సరుబుజ్జిలి మండలం నుంచి వేరుపడి 19 పంచాయతీలతో లక్మీనర్సుపేట మండలం ఏర్పాటైంది. 2022 ఏప్రిల్‌ 4న జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యంలో, రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో విలీనమైంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు మిగిలాయి. ప్రస్తుతం 30 మండలాలతో కొనసాగుతోంది.

నాయకుల పుట్టినిల్లు...

ఎందరో మహనీయులు జిల్లా నుంచి అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్‌కు తొలి చైర్మన్‌గా బెండి కూర్మన్న వ్యవహరించారు. జిల్లా తొలి కలెక్టర్‌గా షేక్‌ అహ్మద్‌ బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఏర్పడిన తొలినాళ్లలో సర్దార్‌ గౌతు లచ్చన్న, బొడ్డేపల్లి రామ్మోహన్‌రావు, లుకలాపు లక్ష్మణదాస్‌, గొర్లె శ్రీరాములనాయుడు, మజ్జి తులసీదాస్‌, బగ్గు సరోజినీదేవి, పాలవలస రుక్మిణమ్మ వంటి నాయకులు రాజకీయాల్లో రాణించారు. సర్దార్‌ గౌతు లచ్చన్న స్వాతంత్రద్యోమంలో పాలుపంచుకున్నారు. 1952లో తొలిసారిగా కృషీకర్‌ లోక్‌పార్టీ తరుపున సోంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగే బొడ్డేపల్లి రాజగోపాలరావు సుదీర్ఘకాలం శ్రీకాకుళం ఎంపీగా పదవి చేపట్టారు. 1952 నుంచి నిరంతరాయంగా గెలుస్తూ వచ్చారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. జిల్లాకు చెందిన మజ్జి తులసీదాస్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడయ్యారు. జిల్లాకు చెందిన కింజరాపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా ప్రాతినిఽథ్యం వహిస్తూ కేంద్రమంత్రి అయ్యారు. మరో మహిళా ఎంపీ కిల్లి కృపారాణి సైతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌, గౌతు శివాజీ, గుండ అప్పలసూర్యనారాయణ వంటి నేతలు అమాత్యులుగా రాణించారు. తొలి మహిళా అసెంబ్లీ స్పీకర్‌గా కావలి ప్రతిభాభారతి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. జిల్లాకు చెందిన రొక్కం లక్మీనరసింహం దొర, తంగి సత్యనారాయణ, ప్రతిభాభారతి, తమ్మినేని సీతారాంలు ఏపీ అసెంబ్లీ స్పీకర్లయ్యారు. ఇలా జిల్లాకు చెందిన ఎంతోమంది నేతలు రాజకీయంగా రాణించారు

6
332 views