🏵️శ్రీకృష్ణ జయంత్యోత్సవములు🏵️
తేదీ,16 -08 -2025: శేర్లింగంపల్లి,ఈరోజు శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని, శ్రీకృష్ణ జయంత్యోత్సవ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో, బీరంగూడ గుట్ట మీద వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ ఆవరణ మందు అత్యంత కన్నుల పండుగ గా,శోభాయమానంగా,భక్తుల కోలాహాలముల మధ్య, శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని,శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ,శ్రీకృష్ణ భగవానుని కలిశస్థాపన, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం మహిళా భక్తులు కోలాట భజనలతో అంగరంగ వైభవంగా కార్యక్రమ నిర్వహణ జరిగింది. తదనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం నాలుగు గంటలకు ఉట్ల సంబరంలో భాగంగా, ఉట్టిని కొట్టించుట, పల్లకి సేవ, భజన కార్యక్రమం, పవళింపు సేవ, ఆతదనంతరం తీర్థప్రసాద స్వీకరణ మొదలగు కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి,కార్పొరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి,మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నాగేష్ యాదవ్, మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, సిపిఐ నాయకులు వీర్ల ప్రకాష్ రావు యాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షులు బి సుధాకర్ యాదవ్,కాటా సుధారాణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ, ఈరోజు విష్ణు భగవాన్ దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ అవతారం అవతరించిన సుదినం అని తెలిపారు. ఈ కృష్ణాష్టమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తారని తెలియజేశారు. శ్రీ కృష్ణ భగవానుడు చంద్రవంశములోని యదుకులములో, వృష్టి శాఖ యందు, దేవకి వసుదేవులకు జన్మించాడు. ఆయన యొక్క సిద్ధాంతం భగవద్గీత. ఆ గీతలో ధర్మం, కర్మ, మోక్షం, యోగ వంటి అనేక విషయాలను, విశ్వ మానవాళికి వ్యక్తీకరించాడు. మానవ వికాసానికి నాటికి నేటికి రాబోయే తరానికి కూడా భగవద్గీత ఉపకరిస్తుందని తెలిపారు. ఆయన గొప్ప స్థితప్రజ్ఞుడు. జన్మించిన దగ్గర నుంచి నిర్యాణము వరకు, వదలని చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో మెలిగాడు. ఆయన గొప్ప స్ఫూర్తి ప్రదాత. ధర్మం కోసం,దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ను జీవితాంతం కాపాడుకుంటూ వచ్చిన దేవ దేవుడు. చారిత్రక రాజనీతిజ్ఞుడు. శ్రీకృష్ణ పరమాత్మ తత్వం ప్రేమతత్వమని పేర్కొన్నారు. గీత నిత్య అధ్యయనం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత,విశ్లేషణాత్మకత వంటి నైపుణ్యాలు మెరుగుపడడంతోపాటు, జ్ఞానం వృద్ధి పడుతుందని పేర్కొన్నారు. శ్రీకృష్ణ భగవానుడు గొప్ప సోషలిస్టు. సంపదంత అందరికీ చెందాలని ఉద్దేశంతో,వెన్న, నెయ్యి, పాలు పెరుగు వంటి సంపదను ఇతరులకు పంచిపెట్టాడు. గోసంరక్షణ, భూ సంరక్షణకై,విశేష కృషి సలిపాడు.జాంబవతిని వివాహం చేసుకొని, రాణి హోదాను కల్పించి, సమసమానత్వానికి పెద్దపీట వేశాడు. మహిళా సంరక్షణకై ద్రౌపదికి వస్త్రాపహరణ కానివ్వకుండా కృషి చేశాడు. మనం కేవలం శ్రీ కృష్ణాష్టమి రోజు వివిధ భక్తీ పూర్వక కార్యక్రమాలతో సరిపించుకోకుండా, ధర్మం కోసంఆయన చూపిన బాటలో,సమ సమాజ న్యాయానికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు అక్రమాలకు, అడ్డుకట్ట వేసుకుంటూ, ముందుకు సాగుటవలన శ్రీకృష్ణ పరమాత్మ వార వారసత్వ సంపదలకు, సమైక్యతకు, సమగ్రతకు, మనం కృషి చేసినప్పుడే సరైన వారసులం అవుతామని, భగవద్గీత సిద్ధాంత కర్త అయిన శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యం చెందగలమని అదే మానవ జన్మకు పరమావధి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ బసవరాజు, డొక్కు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు (డొక్కు బ్రదర్స్) శివప్రసాద్, వాసు, రామాలరాజు, పాములేటి యాదవ్, డి. హరిబాబు యాదవ్, మధు యాదవ్, మోహన్ యాదవ్, వీర్ల సత్యనారాయణ, రామన్న, నాగబాబు, కుర్రాకుల గోపి, మోహన్ యాదవ్, గోరిపత్తి ఆంజనేయులు, డి. నాగబాబు, సింగారయ్య, డొక్కు వెంకటేశ్వరరావు, పిసిజే మూర్తి,వంశీ యాదవ్, డొక్కు భార్గవ్, జీ. రఘునందన్, ఏవి సత్య శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.