logo

ఏడు పాయలుగా చీలిన నది, నీటిమధ్యలో అద్భుత ఆలయం.. ఉదయం అలా వెళ్ళి సాయంత్రం ఇలా తిరిగిరావచ్చు

హైదరాబాద్ నుండి కేవలం గంట రెండుగంటల దూరంలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ ఉంది. నది పాయలుపాయలుగా చీలి ప్రవహిస్తే ఆ నీటిమధ్యలో ఆలయం ఉంటుంది.
ప్రాంతమేది? హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి? ఇక్కడ తెలుసుకుందాం.

Hyderabad Weekend Trip : ఓ నది పాయలు పాయలుగా చీలిపోయి ప్రవహిస్తుంటే... వాటి మధ్యలో ఓ ఆలయం... చుట్టూ కొండలు, పచ్చని చెట్లతో ప్రకృతి అందాలు... మూగజీవుల సందడి, పక్షుల కిలకిలరావాలు... చదువుతుంటేనే ఇంత అందమైన ప్రాంతం ఎక్కడుందో తెలుసుకోవాలని కుతూహలం పెరుగుతుందికదా?... ఇలాంటి ప్రాంతం మన తెలంగాణలోనే ఉంది... హైదరాబాద్ కు కేవలం గంట గంటన్నర జర్నీ దూరంలోనే ఉంటుంది. ఈ ప్రకృతి రమణీయ ప్రదేశం ఏడుపాయల... మెదక్ పట్టణానికి సమీపంలో ఉంటుంది.
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మంజీరా నది ఒడ్డున, పచ్చని అటవీప్రాంతంలో ఈ ఏడుపాయల ప్రాంతం ఉంటుంది. ఇక్కడికి వెళ్లే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతినే కాదు నేచర్ ను ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా మంజీరా నది పాయలుపాయలుగా చీలి ప్రవహిస్తుండటం... వాటి మధ్యలో ఓ కొండగుహలో అమ్మవారు వెలియడం అద్భుతం. వర్షాకాలంలో అయితే ఎటుచూసినా నీటి ప్రవాహమే కనిపిస్తుంది... ఒక్కోసారి ఆలయం కూడా నీటిలో మునిగిపోతుంది.

ఏడుపాయలకు దైవ దర్శనం కోసమే కాదు సరదాగా పార్టీ చేసుకునేందుకు చాలామంది కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వెళుతుంటారు. ఈ నది చీలికల ఒడ్డున కోళ్లు, మేకలు కోసుకుని మందుపార్టీలతో విందు చేసుకుంటారు. అమ్మవారికి వేటలను బలిఇచ్చే దేవాలయాల్లో ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఒకటి. అందుకే ఆదివారం వచ్చిందంటే చాలు చుట్టుపక్కలనుండే కాదు సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు... అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మందు, విందు కానిస్తారు.
మహాశివరాత్రి వేళ ఈ ఏడుపాయల పరిసరాలు భక్తులతో కిటకిటలాడతాయి... మంజీరా నదీ పాయల్లో స్నానంచేసి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈ పండగ సమయంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరిస్తారు.. ఎడ్ల బండ్ల ఊరేగింపు వంటి ప్రత్యేక వేడుకలు కూడా జరుగుతాయి.
కొండగుహలో వెలిసిన వనదుర్గామాత కోరిన కోర్కెలు తీరుస్తుందని నమ్ముతారు... అందుకే తమ కోర్కెలు తీర్చాలని కొందరు... కోర్కెలు తీరడంతో మరికొందరు మేకలు, కోళ్లను బలిస్తారు. ఇలా నిత్యం వేలాది జీవాలను వనదుర్గామాతకు బలిచ్చి అక్కడే పచ్చని చెట్లు, కొండలమద్య విందు జరుపుకుంటారు.

ఏడుపాయల వనదుర్గామాత ఆలయం చాలా ప్రాచీనమైనది... వందల ఏళ్ల చరిత్ర కలిగివుంది. ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం… ద్వాపరయుగంలో పరీక్షిత్ మహారాజు పాముకాటుతో చనిపోవడంతో అతడి కొడుకు జనమేజయుడు సర్పజాతిని అంతం చేయడానికి పూనుకుంటాడు. ఇందుకోసం ఏడుగురు మునులతో సర్పయాగం నిర్వహించి సర్పాలన్ని ఆ అగ్నిలో ఆహుతి అయ్యేలా చేస్తాడు. అయితే ఈ సర్పాలకు మోక్షం కల్పించేందుకు గరుడ్మంతుడు భోగవతి నదిని తీసుకునివస్తాడు... ఇది యజ్ఞస్థలికి రాగానే ఏడుపాయలుగా చీలుతుంది. సర్పయాగం జరిగిన గుండాలను ఈ పాయలు ముంచుతూ ముందుకు ప్రవహిస్తాయి.. ఇందులో ఓ పాయ కొండగుహలో వెలిసిన అమ్మవారి పాదాలు తాకుకుంటూ వెళుతుంది. ఇలా ఏడుగురు రుషులు యజ్ఞం చేసిన ప్రాంతం.... నది ఏడుపాయలుగా చీలిన ప్రాంతం కాబట్టి దీనికి ఏడుపాయలు అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.
హైదరాబాద్ నుండి సొంత వాహనాల్లో ఈ ఏడుపాయలకు ఈజీగా చేరుకోవచ్చు. NH7 హైవే మీదుగా ప్రయాణంచేస్తే రెండు గంటల్లో ఏడుపాయల చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నుండి ఆర్టిసి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి... నేరుగా ఏడుపాయలకు లేదంటే మెదక్ కు చేరుకుని అక్కడినుండి వెళ్లవచ్చు. ఏడుపాయల చేరుకోడానికి మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగివచ్చేంత దూరంలో ఈ ఆద్యాత్మిక, ప్రకృతి అందాలతో నిండిన ఏడుపాయల ప్రాంతం ఉంది. ఇక్కడికి సొంత వాహనాల్లో వెళితే మరికొన్ని ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు.

9
7 views