
రెండున్నర రెట్లు పెరిగిన ఖర్చు....
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. గత దశాబ్ద కాలంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోవడంపై కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి 28 రాష్ట్రాల అప్పులు రూ.17.57 లక్షల కోట్లు ఉండగా, 2022-23 నాటికి రూ.59.60 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించింది. దీంతో పాటుగా అప్పులు, రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలకు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లపై కాగ్ తాజా నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు, పింఛన్లు, రుణాల వడ్డీల చెల్లింపులపై అధిక భాగం వ్యయం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఖర్చు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా పదేళ్లలో 2.49 రెట్లు పెరిగిందనితెలిపింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6.26 లక్షల కోట్లు ఉండగా.. 2022-23 అది ఏకంగా 15.63 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించింది. ఈ మొత్తం రాష్ట్రాల మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు సగమని తెలిపింది. ఇంకా సబ్సిడీలు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్‌లను కలిపితే.. రాష్ట్రాలు చేసే వ్యయంలో ప్రతి రూపాయిలో ఐదింటిలో నాలుగుకు పైగా వంతు వాటికే పోతోందని వివరించింది. జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ అప్పులపై వడ్డీ చెల్లింపులను ‘నిబద్ధ వ్యయం’గా పరిగణిస్తారు. 2013-14, 2022-23 మధ్య రాష్ట్రాల మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం స్థిరంగా 80-87 శాతం నడుమ ఉంటోంది. రాష్ట్రాల మొత్తం జీఎస్డీపీలో ఆ వాటా 13-15 శాతం మధ్య ఉంది. 2022-23 ఆర్థిక ఏడాది వరకు చూస్తే.. రెవెన్యూ వ్యయం రూ.35.96 లక్షల కోట్లుగా ఉంది. ఇది మొత్తం వ్యయంలో 85 శాతం, మొత్తం జీఎస్డీపీలో 13.85 శాతం. 2022-23లో మొత్తం రెవెన్యూ వ్యయంలో వేతనాలు, పింఛన్లు, రుణాలకు వడ్డీ వంటి వాటికి రూ.15.63 లక్షల కోట్లు ఖర్చు చేయగా, సబ్సిడీలు రూ.3.09 లక్షల కోట్లకు చేరాయి. అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్‌లు రూ.11.26 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ మూడింటిని కలిపితే మొత్తం రెవెన్యూ వ్యయంలో 83 శాతంగా తేలింది. దీని వలన అభివృద్ధి, మూలధన వ్యయం కోసం తక్కువ వెసులుబాటు ఉంటోందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.....