logo

సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist



సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
సీఎం, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో సరికొత్త ఆవిష్కరణలకు ఏపీ టూరిజం శాఖ శ్రీకారం చుట్టిందని శాసనసభలో వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్

*గత శాసనసభ సమావేశాల్లో పర్యాటకాభివృద్ధి గురించి చెప్పిన మాటలను ఇప్పటికే 50 శాతం చేతల్లో చూపించామని ఘంటాపథంగా చెప్పిన మంత్రి కందుల దుర్గేష్

*రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్స్, వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు.. విభిన్న పర్యాటక ప్రక్రియలతో సమగ్ర పర్యటకాభివృద్ధికి బాటలు వేస్తున్నామని వెల్లడి

*15 నెలల్లోనే 103 సంస్థలతో ఎంవోయూలు, రూ.10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు సాధించామని పేర్కొన్న మంత్రి దుర్గేష్

*కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ పథకాల ద్వారా రూ.441 కోట్ల నిధులు రాబట్టామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్

*చీరాల సముద్ర తీర పర్యాటకాన్ని ప్రోత్సాహించి, అభివృద్ధి తీసుకునేందుకు తీసుకుంటున్న చర్యల విషయంలో అసెంబ్లీలో మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చిన సమాధానంపై రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నిచ్చిందని సంతృప్తి వ్యక్తం చేసిన చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య

*విజయవంతమైన గోవా పర్యటకాన్ని అధ్యయనం చేసి ఆ నమూనాను ఏపీలో అమలు చేసేలా, తద్వారా పర్యాటక ఆదాయం పెంపొందేలా చర్యలు తీసుకొనేందుకు కమిటీ వేయాలని మంత్రి దుర్గేష్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచన.. అమలు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్

*గత ప్రభుత్వ హయాంలో పర్యాటకాభివృద్ధి శూన్యం.. వారి అనాలోచిత నిర్ణయాలతో పర్యాటక రంగం కుదేలైందని విమర్శ

అమరావతి: సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం శాసనసభలో ప్రసంగించిన మంత్రి దుర్గేష్ గత ప్రభుత్వ హయాంలో పర్యాటకాభివృద్ధి శూన్యమని చెబుతూ వారి అనాలోచిత నిర్ణయాలతో పర్యాటక రంగం కుదేలైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ 15 నెలల కాలంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరించారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో సరికొత్త ఆవిష్కరణలకు ఏపీ టూరిజం శాఖ శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో సమగ్ర పర్యాటకాభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు, పర్యాటక ప్రాజెక్టులను గురించి మంత్రి దుర్గేష్ సభలో ప్రస్తావించారు. గత శాసనసభ సమావేశాల్లో పర్యాటకాభివృద్ధి గురించి చెప్పిన మాటలను ఇప్పటికే 50 శాతం చేతల్లో చూపించామని మంత్రి కందుల దుర్గేష్ ఘంటాపథంగా చెప్పారు.

*మంత్రి దుర్గేష్ సమాధానంపై చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సంతృప్తి*

విజయవంతమైన గోవా నమూనాను స్ఫూర్తిగా తీసుకొని చీరాలలో సముద్ర ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించి, అభివృద్ధి చేయుటకు తీసుకుంటున్న చర్యలు, చారిత్రక ప్రదేశాలైన మోటుపల్లి, పురాతన వీరభద్రస్వామి గుడిని ప్రధాన పర్యాటక కేంద్రంగా రూపొందించిన ప్రణాళికల వివరాలు, చీరాల సమీప ప్రాంతాల్లోని బీచ్ ల్లో రహదారి అనుసంధానత మౌలిక సౌకర్యాల మెరుగుకు తీసుకున్న ప్రణాళికలు, రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల నుండి పర్యాటకులను ఆకర్షించుటకు తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మలకొండయ్య అడిగిన ప్రశ్నకు సభలో మంత్రి దుర్గేష్ సమాధానమిచ్చారు. పర్యాటకులకు మౌలిక సదుపాయాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని, తద్వారా మౌలిక సదుపాయాలకు మరిన్ని నిధులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చిన సమాధానంపై రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి చీరాల ప్రజలకు సంతోషాన్నిచ్చిందని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి దుర్గేష్ సుదీర్ఘ ప్రసంగం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవా పర్యటకాన్ని అధ్యయనం చేసి ఏపీలో అమలు చేసేలా, పర్యాటక ఆదాయం పెంపొందేలా చర్యలు తీసుకొనేందుకు కమిటీ వేయాలని మంత్రి దుర్గేష్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించగా అందుకు మంత్రి దుర్గేష్ స్పందించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

*ఈ సందర్భంగా పర్యాటక రంగం పురోగతిపై అసెంబ్లీలో ప్రసంగిస్తూ మంత్రి కందుల దుర్గేష్ ఏమన్నారంటే...*

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. చీరాలలో సముద్ర ఆధారిత పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగా రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి కార్యాచరణ ఏర్పాటు చేశాం. చీరాలలోని వీరభద్ర స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పురావస్తు శాఖ వద్ద భద్రపరిచిన మూలవిరాట్ విగ్రహాలను ఆలయంలో తిరిగి ప్రతిష్టించే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా వీరభద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. కోదండరామ స్వామి ఆలయంలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. హైదరాబాద్ మ్యూజియంలో ఉన్న పంచలోహ విగ్రహాలను విజయవాడ మ్యూజియానికి తరలించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదే విధంగా అద్దంకి శాసనాన్ని చెన్నై మ్యూజియం నుండి విజయవాడ మ్యూజియంకు తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. చీరాల చుట్టుప్రక్కల ఉన్న బీచ్ కు రోడ్డు అనుసంధానం కలిగించేందుకు రోడ్లు, భవనాలు మరియు పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ విభాగాలతో కలిపి జిల్లా స్థాయి పర్యాటక మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రతిపాదనలు చేపట్టాం. అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ సదుపాయాలు, లైటింగ్ మరియు పర్యాటకులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు పర్యాటక శాఖ ద్వారా వినూత్న కార్యక్రమాలు చేపట్టాం. గతంలో శాసనసభ సమావేశాల్లో ఏం చేయబోతున్నామని చెప్పాం.. ఈ సమావేశాల్లో ఏం చేశామో చెప్పబోతున్నాం అనే అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

*2029 నాటికి 50,000 గదుల ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్*

గతంలో 2019-24 వరకు ఉన్న ప్రభుత్వం పేరుకే మాటల చెప్పింది కానీ ఏనాడూ వాటిని కార్యరూపం దాల్చడంపై శ్రద్ధ పెట్టలేదని మంత్రి దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం 15 నెలల కాలంలో 103 సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకొని రూ.10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు సాధించింది. తద్వారా విభిన్న పర్యాటక ప్రక్రియలతో పాటు హోటళ్లు, రిసార్టులు, థీమ్ పార్కులు, ఎకో మరియు అడ్వెంచర్ ప్రాజెక్టులు, వెల్‌ నెస్ రిట్రీస్ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాం. ఇప్పటికే రూ.3,887 కోట్లతో 15 ప్రాజెక్టులు ప్రారంభించాం. వీటిలో 2,848 హోటల్ గదులు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం 19,500 గదులు అందుబాటులో ఉన్నాయి. 2029 నాటికి మొత్తం గదుల సంఖ్య 50,000కు చేరేలా లక్ష్యాన్నినిర్ణయించాం. అంతేగాక ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. ఇప్పటికే దీనికోసం ప్రత్యేకంగా పాలసీ తీసుకొచ్చాం. ఎవరైతే ఎక్కువ ఉపాధి కల్పిస్తారో వారికి ఎక్కువ రాయితీలు ఇచ్చే విధానాలను రూపొందించాం. అదే విధంగా 2024-29కి ప్రత్యేక పర్యాటక పాలసీ తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రాష్ట్రానికి సీఎం, డిప్యూటీ సీఎంలు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించారు. తద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులకు ప్రత్యేక పన్నురాయితీలు, మూలధన సబ్సిడీ, ఉపాధి ప్రోత్సాహకాలు, జీఎస్టీ రీయింబర్స్ మెంట్ వారికి వర్తిస్తాయి అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక పాలసీని, పర్యాటక రంగానికి కల్పించిన పారిశ్రామిక హోదాతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సమావేశంలో కానీ, ఢిల్లీ, ముంబయి, అంతర్జాతీయంగా ఏర్పాటు తాము పాల్గొన్న సమావేశంలో దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే 17 ప్రాజెక్టులు పట్టాలెక్కించాం.

*గ్రామీణ, గిరిజనప్రాంతాల్లో10,000 హోమ్ స్టేలు ఏర్పాటు: మంత్రి కందుల దుర్గేష్*

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో గ్రామీణ, గిరిజనప్రాంతాల్లో10,000 హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. తద్వారా పూర్వపు ఇళ్లను బాగు చేసుకొని ఆ ఇళ్లలో పర్యాటకులకు వసతి కల్పించడం ద్వారా గ్రామీణ వాతావరణ అనుభూతులను కల్పించడమే గాక, అక్కడి ఆవశ్యకతను తెలియజేస్తున్నాం. దీనివల్ల స్థానికుల ఆదాయం పెరుగుతుంది. స్థానిక సంస్కృతి, జీవన శైలి పరిచయం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నట్లుగా క్యారవాన్ టూరిజంను అందుబాటులోకి తెస్తున్నాం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో త్రీస్టార్, ఫైవ్ స్టార్, స్టార్ హోటళ్లు కట్టలేని పక్షంలో క్యారవాన్ టూరిజం పాలసీ ద్వారా క్యారవాన్ తో పర్యాటకులు పర్యాటక ప్రాంతాలను సందర్శించడమే గాక వసతి కల్పన కూడా ఉంటుంది. ఇటీవలే వైజాగ్ లో సీఎం చేతుల మీదుగా హాప్-ఆన్ హాప్-ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించాం. అడ్వెంచర్ టూరిజం పాలసీ ద్వారా రాష్ట్రంలోని విశాల సముద్రతీర ప్రాంతంలో అడ్వెంచర్ యాక్టివిటీస్ ను ప్రవేశపెడుతున్నాం. వైజాగ్, కాకినాడ, పేరుపాలెం, చీరాల, బాపట్ల బీచ్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించిన నెల్లూరులో వేలాంగణి చర్చి పరిసర ప్రాంతాలు, కోడూరు బీచ్ తదితర ప్రాంతంలో అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రామ్ దేవ్ బాబాతో ఎంవోయూ కుదుర్చుకున్నాం. ఈ తరహా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది అన్నారు. అంతేగాక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలతో రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

*రాష్ట్ర పర్యాటక రంగంపై కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉంది: మంత్రి కందుల దుర్గేష్*

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజమహేంద్రవరంలో రూ. 94.44 కోట్లతో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, కడప జిల్లాలో రూ.77.91 కోట్లతో గండికోట, రూ.97.52 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేష్ వివరించారు. రూ.29 కోట్లతో బొర్రా గుహల్లో ఎక్స్ పీరియన్స్ సెంటర్, రూ.50 కోట్లతో అహోబిలం, నాగార్జున సాగర్ లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. రూ.25.32 కోట్లతో అన్నవరం దేవాలయం అభివృద్ధి చేస్తున్నాం. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావడం, రాష్ట్రంలో పీపీపీ విధానంలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

1
207 views