logo

భారతీయ టెకీలకు కెనడా 'గోల్డెన్ ఆఫర్'.. టాలెంట్ చూపిస్తే డాలర్లు కురుస్తాయి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన H-1B వీసా లక్ష డాలర్ల ఫీజు నిబంధన టెక్ రంగంలో పనిచేసే నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు పెద్ద షాక్ తగిలింది.

ఈ కఠినమైన నిబంధనల వల్ల అమెరికాలో ఉండలేక, వీసా పొందలేక ఇబ్బంది పడుతున్న టెక్ నిపుణులపై ఇప్పుడు కెనడా కన్ను పడింది. అమెరికాలో తమ 'డాలర్ డ్రీమ్స్' చెదిరిపోతున్న సమయంలో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ వీరిని తమ దేశానికి ఆకర్షించడానికి సరికొత్త వ్యూహాన్ని బయటపెట్టారు.

కెనడా ప్రధాని మార్క్ కార్నీ తాజాగా లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ..

కొత్త వీసా ఫీజు నిబంధనలు రాకముందు అమెరికాలో పనిచేసిన అనుభవం ఉన్న టెక్ ఉద్యోగులు తమ దేశానికి రావడానికి సుముఖంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా, గతంలో H-1B వీసాలు కలిగి ఉన్న నిపుణులను ఆకర్షించే 'గొప్ప అవకాశం' కెనడాకు ఉందని ఆయన నొక్కి చెప్పారు. ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్ వంటి కీలక రంగాలపై ఆధారపడిన కంపెనీలకు గందరగోళాన్ని, నిరాశను సృష్టించిందని ఆయన గుర్తించారు.

ట్రంప్ మామ ఏకపక్ష నిర్ణయాలతో ప్రపంచ ప్రతిభను తరిమేస్తుంటే, కెనడా ఆ టాలెంట్‌ను ఒడిసిపట్టుకోవడానికి రెడీ అవుతోంది. కెనడా ప్రభుత్వం ప్రస్తుతం తమ ఇమ్మిగ్రేషన్ వ్యూహాన్ని పూర్తిగా సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా, అమెరికాలో అవకాశాలు కోల్పోయిన ఈ అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను ఎలా ఆకర్షించాలి అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ప్రధాని కార్నీ చెప్పారు. త్వరలోనే ఈ విషయంలో "స్పష్టమైన ప్రతిపాదన" ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.

అమెరికాలో H-1B వీసాలు చేజారిపోవడం లేదా నిబంధనలు కఠినంగా మారడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నిపుణులు ప్రత్యామ్నాయ వైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని కేవలం కెనడా మాత్రమే కాక, జర్మనీ, యూకే వంటి ఇతర ఐరోపా దేశాలు కూడా వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ దేశాలన్నీ నైపుణ్యం కలిగిన కార్మికులకు తాము 'ప్రత్యామ్నాయ గమ్యస్థానం'గా ఉన్నామని ఘంటాపథంగా చెబుతున్నాయి.

H-1B వీసాలపై ఫీజు లక్ష డాలర్లు విధించడం, అలాగే వీసా నిబంధనలను కఠినతరం చేయడం అమెరికా కంపెనీలకు, నిపుణులకు పెద్ద షాక్. కానీ, ఇదే నిర్ణయం కెనడా వంటి దేశాలకు 'వరంగా' మారింది. అమెరికాను వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న నిపుణులను వీరు సులభంగా తమ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా, అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయ టెకీలను ఆకర్షించడంలో కెనడా ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

4
58 views