
7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
శ్రీకాకుళం:ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఈ నెల 7న విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు కె.భానుమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం ఎన్‌జీఓ భవన్‌లో ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామమూర్తి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడం, మెరుగైన పీఆర్‌సీ, మధ్యంతర భృతి మంజూరు, మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ వంటి హామీలు కాలేదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు ఏటా రూ.180 కోట్లు హెల్త్‌కార్డుల కోసం చెల్లిస్తున్నా ఆస్పత్రులు అంగీకరించడం లేదన్నారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా, అంతర్ జిల్లా బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ పడాల ప్రతాప్‌కుమార్, కార్యవర్గ సభ్యులు జి.రమణ బి.వెంకటేశ్వర్లు వి.సత్యనారాయణ, కుప్పిలి జగన్మోహన్, చావలి శ్రీనివాస్, వి.నవీన్‌కుమార్, వి.రామారావు, పి.హరిప్రసన్న, టి.శ్రీనివాసరావు, డి.రామ్మోహన్ డి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు