logo

ఒడిశా లీకు వీరులకు షాక్.. 114 మంది అభ్యర్థులు పట్టివేత మరో మూడు బస్సులు అడ్డగింత ఒడిశా పోలీసులకు అప్పగింత

శ్రీకాకుళం : ఒడిశా రాష్ట్ర పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఈనెల 5,6 తేదీల్లో నిర్వహిస్తున్న ఎస్ ఐ పోస్టుల రాత పరీక్ష ప్రశ్నపత్రాల దొంగిలిచిన ముగ్గురు ప్రైవేటు ఏజెన్సీ ప్రతినిధులను, అడ్డదారిలో ఎస్ ఐ ఉద్యోగాలను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేసిన 114 మంది అభ్యర్థులను, వీరు ప్రయాణిస్తున్న మూడు ప్రైవేటు ట్రావెల్ బస్సులను శ్రీకాకుళం పోలీసులు పట్టుకుని, ఒడిశా పోలీసులకు అప్పగించారు.వాస్తవానికి ఈ ఘటన సోమవారం సాయంత్రం జరుగగా, పట్టుబడిన అభ్యర్థులను విచారణ పూర్తి చేసేంత వరకు అటు ఒడిశా పోలీసులు, ఇటు శ్రీకాకుళం పోలీసులు బుధవారం సాయంత్రం వరకు రహస్యంగా ఉంచారు.ఒడిశా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఎస్ ఐ పోస్టుల భర్తీకి ఇప్పటికే రెండుసార్లు రాత పరీక్షల తేదీ లను ప్రకటించి, రెండుసార్లూ కూడా ప్రశ్నపత్రాల లీకు ఆరోపణలు రావడంతో పరీక్ష లను వాయిదావేసింది. మళ్లీ మూడవసారి ఈ పరీక్ష లు ఈనెల 5,6 తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.కాగా ప్రశ్నపత్రాల తయారీ ఒక ఏజెన్సీకి అప్పచెప్పడంతో రెండుసార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. మూడవసారి కూడా మరో ప్రైవేటు ఏజెన్సీ కి ఇచ్చారు. మూడవసారి కూడా అవి లీక్ అయినట్లు ఆరోపణలు రావడమే కాకుండా, లీక్ అయిన ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు ఇచ్చేందుకు ఏజెన్సీ ప్రతినిధులు మూడు బస్సులలో అభ్యర్థులను ఒడిశా నుంచి తీసుకు వెళుతున్నట్లు గజపతి జిల్లా పోలీసులకు సమాచారం అందటంతో ఒడిశా పోలీసులు ఆ బస్సులను అడ్డుకునేందుకు సోమవారం ఉదయం వేట ప్రారంభించారు.

ఆపటికే ఆ మూడు బస్సులు ఒడిశా బోర్డర్ దాటి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించినట్లుగా తెలియడంతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి గజపతి జిల్లా పోలీసులు తెలియచేసారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం డి ఎస్పీ కి సమాచారం తెలియచేసి, జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.నరసన్నపేట, ఆమదాలవలస, జె ఆర్ పురం సీఐ లతో మూడు బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. నరసన్నపేట మడపాం చెక్ పోస్టు వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా, అప్పటికే మడపాం టోల్గేట్ ఆ బస్సులు దాటిపోయినట్లుగా పోలీసులకు తెలియడంతో ఆ సమాచారాన్ని ఆమదాలవలస, జె ఆర్ పురం పోలీసు బృందాలకు తెలిపారు.
చివరకు జే ఆర్ పురం సీఐ బృందం పోలీసులు ఎచ్చెర్ల జాతీయ రహదారిపై ఈ మూడు బస్సులను పట్టుకుని తనిఖీలు చేశారు. వెంటనే ఆ మూడు తులసి ట్రావెల్స్ బస్సులను ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ కి తరలించి ఈ సమాచారాన్ని ఒడిస్సా గజపతి జిల్లా ఎస్పీకి తెలిపారు.హుటాహుటిన ఒడిస్సా పోలీసులు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ కు రాగా, ఆ బస్సులను, వాటిలో ప్రయాణిస్తున్న 114 మంది అభ్యర్థులను, వారిని తీసుకు వెళుతున్న ముగ్గురు ఏజెన్సీ ప్రతినిధులను ఒడిస్సా పోలీసులకు అప్పగించారు.
బస్సులను, అభ్యర్థులను ఒరిస్సా తరలించి, అభ్యర్థులను, ఏజెన్సీ ప్రతినిధులను విచారించారు.ఈ విచారణలో అభ్యర్థులకి విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ప్రశ్నపత్రాలు ఇచ్చేందుకు వారిని ఏజెన్సీ ప్రతినిధులు బస్సులలో తీసుకువెళుతున్నట్లు గా స్పష్టమైంది.కాకుండా ప్రశ్నపత్రాలు ఇచ్చినప్పుడు ఒక్కొక్క అభ్యర్థి 10 లక్షల రూపాయిలు ఇవ్వడానికి, ఎస్ ఐ పోస్టు వచ్చినప్పుడు మరో 20 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, అలా ఒక్కొక్క అభ్యర్థి ఎస్ ఐ పోస్టుకు 30 లక్షల రూపాయిల చొప్పున వసూలు చేస్తున్నట్లుగా ఒరిస్సా పోలీసుల విచారణలో తేలినట్లుగా ప్రచారం జరిగింది.
మొత్తానికి ఒరిస్సా రాష్ట్రంలో ఒక కుదుపు కుడిపిన ఎస్ ఐ పోస్టుల ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిందితులను శ్రీకాకుళం పోలీసులు పట్టుకోవడడంతో జిల్లా పోలీసులను అందరూ ప్రశంసిస్తున్నారు.

0
0 views