
మదనపల్లె జిల్లా అభివృద్ధికి ఊతం...
అభివృద్ధికి దోహదం చేసే పరిశ్రమల ఏర్పాటు పై పాలకులు దృష్టి సారించాలి
మదనపల్లె కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటునకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్రను వేశారు. ఈ ప్రక్రియపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులకు పచ్చజెండా ఊపారు. జిల్లా ఏర్పాటుతో పాటు పీలేరు రెవెన్యూ డివిజన్ కు ఆమోదం తెలిపారు. చారిత్రాత్మక మదనపల్లె ప్రాంతం జిల్లా కేంద్రం కావడంపై పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సంబరపడుతున్నారు. ప్రతిపక్ష హోదాతో పాటు అధికారం చేపట్టాక సైతం సిఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేశ్ సైతం యువగళం పాదయాత్రలో హామీ ఇవ్వగా ఇప్పుడు నెరవేర్చారు. మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా ఏర్పాటవుతోంది. ఇప్పటి వరకు పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉండగా ఇప్పుడు మదనపల్లె జిల్లాలో చేరుతోంది.
అన్ని మండలాలకు చేరువలో జిల్లా కేంద్రం...
మదనపల్లెకు సమీపంలోనే పుంగనూరు ఉంది. పీలేరు, తంబళ్లపల్లె సైతం దగ్గరే ఉన్నాయి. జిల్లా కేంద్రానికి రాకపోకలకు సౌలభ్యం ఉంది. పీలేరు-మదనపల్లె జాతీయ రహదారి ఇటీవల అందుబాటులోకి వచ్చింది
ఏ వైపునకు చూసినా జిల్లా కేంద్రానికి రాకపోకలకు అనువుగా ఉంది. 2022 లోనే జిల్లాల పునర్విభజన సందర్భంగా మదనపల్లెలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో పాటు ఆందోళన సైతం ప్రజలు చేపట్టారు.
మరింత అభివృద్ధికి అవకాశాలు...
మదనపల్లె మరింత అభివృద్ధి చెంద డానికి జిల్లా కేంద్రం దోహదపడ నుంది. బెంగళూరు నగరానికి సమీ పంలోని మదనపల్లె అన్ని రంగాల్లో కేంద్రంగా రూపాంతరం చెందడంతో మరింత అభివృద్ధికి మార్గం సుగమంకానుంది. బ్రిటీష్ కాలం నాటి భవనాలు, ప్రభుత్వ స్థలాలు జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలైన తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుంది. జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు స్వీకరణకు నెల రోజుల వ్యవధి ఇవ్వనున్నారు. ఈలోపు అన్నీ సవ్యంగా జరిగితే నెల ఆఖరుకు ప్రక్రియ పూర్తి అవుతుంది. నూతన సంవత్సరం 2026 జనవరి 1 నుంచి కొత్త జిల్లా నుంచి కార్యకలా పాలు ప్రారంభం కానున్నాయి.