
శ్రీశైల దేవస్థానం ఆన్లైన్ టికెట్ల జారీ పై సమీక్ష
ఆన్‌లైన్ టికెట్ల జారీ సమీక్ష
భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం అమలు చేస్తున్న ఆన్‌లైన్ విధానాన్ని కార్యనిర్వహణాధికారి,యం. శ్రీనివాసరావు 17.12.2025 సమీక్షించారు. అన్ని శాఖల అధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానం ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ ఆన్‌లైన్ ద్వారా భక్తులు శ్రీస్వామివారి స్పర్శదర్శనం, అతిశీఘ్రదర్శనం రూ. 300ల , శీఘ్రదర్శనం రూ. 150/-ల టికెట్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
అలాగే శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన 14 ఆర్జితసేవలకు సంబంధించిన సేవాటిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చునని పేర్కొన్నారు.
అదేవిధంగా వసతిని కూడా ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు.
ఇందుకోసం భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వెబ్‌సైట్ www.aptemples.ap.gov.in లేదా దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www.srisailadevasthanam.org ల ను మాత్రమే వినియోగించుకోవాలన్నారు.
‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ 95523 00009* ద్వారా కూడా 14 సేవలను అందుబాటులో ఉన్నాయని, శ్రీస్వామి వారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను మరియు ఆర్జితసేవాటిక్కెట్లను పొందవచ్చునని అన్నారు.
ఇంకా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి కూడా ఈ విషయమై భక్తులలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. దీనివలన భక్తులందరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానంలో వసతిని పొంది సౌకర్యవంతంగా శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనాన్ని చేసుకునే వీలుకలుగుతుందన్నారు.
ఉద్యోగులందరు కూడా ఆన్‌లైన్ టికెట్ వివరాలను, చరవాణిలో స్టేటస్‌గా ఉంచాలన్నారు. దీనివలన విస్తృత ప్రచారం లభిస్తుందన్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ వివరాలను దేవస్థానంలో స్వచ్ఛందసేవలు అందించే శివసేవకులకు కూడా తెలియజెప్పాలన్నారు.
ఇంకా వారు మాట్లాడుతూ భక్తులు ఆన్‌లైన్ నందు టికెట్ బుక్ చేసుకున్నవారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కాగా భక్తులలో కల్పించేందుకు ఇప్పటికే పలుచోట్ల ఆన్‌లైన్ విధానాన్ని క్యూ.ఆర్.కోడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతూ మరిన్ని బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రచార మరియు ఇంజనీరింగ్ విభాగాలను ఆదేశించారు.క్షేత్ర పవిత్రతను కాపాడే చర్యలను మరింత పకడ్బందీగా చేపట్టాలని ముఖ్య భద్రతా అధికారిని ఆదేశించారు.
దేవస్థానం టోల్‌గేట్ వద్ద కట్టుదిట్టంగా తనిఖీలను నిర్వహించాలని ముఖ్యభద్రతాధికారిని ఆదేశించారు.
అదేవిధంగా సాధారణ రోజులలో కూడా ఆన్‌లైన్ టికెట్ల సంఖ్యను పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఇంకా వారు మాట్లాడుతూ దేవస్థానం అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను భక్తులు విరివిగా వినియోగించుకోవాలని,అన్నీ ఆర్జితసేవలను మరియు శ్రీస్వామివారి స్పర్శదర్శన టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా
వినియోగించుకోవాలన్నారు.
కాగా ఆర్జితసేవా కర్తలు మరియు స్పర్శదర్శనం టిక్కెట్ పొందిన వారు విధిగా ఆన్‌లైన్ ద్వారా పొందిన టిక్కెట్ ప్రింట్ కాపీని (హార్డ్‌కాపీని) మరియు ఆధార్‌కార్డు నకలును తమవెంట తెచ్చుకోవలసివుంటుంది.
ఆన్‌లైన్ ద్వారా పొందిన ఆయా టిక్కెట్లను స్కానింగ్ జరిపిన తదుపరి మాత్రమే ఆర్జితసేవాకర్తలను మరియు స్పర్శదర్శనం టిక్కెట్లు పొందిన వారిని అనుమతించడం జరుగుతుంది.కాబట్టి భక్తులు టిక్కెట్టు / ప్రింటు కాపీని మరియు ఆధార్ కార్డ్ ప్రతిని ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవలసి ఉంటుందన్నారు.
కాగా సామాన్య భక్తుల సర్వదర్శనానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను అర్జితసేవలు నిర్దిష్టవేళలలో జరిపించబడుతున్నాయన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారి స్పర్శదర్శనం కూడా నిర్దిష్ట వేళల్లోనే కల్పించబడుతుంది.కాబట్టి ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు పొందిన ఆర్జితసేవాకర్తలకు టిక్కెట్ పై సూచించిన సమయములో మాత్రమే ఆయా ఆర్జితసేవలు జరిపించబడుతాయని పేర్కొన్నారు. సేవాకర్తలు వారిసేవా సమయం కంటే కనీసం 15 నిమిషాలు ముందుగా ఆర్జితసేవా క్యూలైన్ ప్రవేశద్వారం వద్ద రిపోర్టు చేయవలసి వుంటుందన్నారు.అదేవిధంగా స్పర్శదర్శనం టిక్కెట్ పొందిన భక్తులకు కూడా టిక్కెట్టుపై పొందుపర్చబడిన సమయములో మాత్రమే స్పర్శదర్శనం కల్పించబడుతుందన్నారు. భక్తులందరు కూడా దేవస్థానం అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని కార్యనిర్వహణాధికారి భక్తులకు సూచించారు.