logo

కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు

ఆళ్లగడ్డ: సంక్రాంతి పండుగను గ్రామీణ ప్రజలతో కలిసి ఆనందంగా జరుపుకుంటూనే, పల్లె ఆరోగ్యం మరియు ప్రజా సేవే లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమమే “మన సంక్రాంతి – మన పల్లె సేవ” కార్యక్రమమని కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ మల్లేశ్వర్ రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలే పల్లె సత్యనారాయణ, కార్యదర్శి బైసాని రవి ప్రకాష్, పాస్ట్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, దేశ్ పాండే ఫౌండేషన్ ట్రైనర్ రాజశేఖర్ రెడ్డి లు అన్నారు. మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రాంపల్లె, నేలంపాడు, పెద్దముడియం మండలం జంగాలపల్లె గ్రామాలలో కె.వి. సుబ్బారెడ్డి విద్యాసంస్థల ఆధ్వర్యంలో, దేశ్పాండే ఫౌండేషన్ నిర్వహణలో, రోటరీ క్లబ్, చైతన్య ఎడ్యుకేషనల్ & రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ప్రణతి హాస్పిటల్స్‌కు చెందిన డా. శ్రీకాంత్ రెడ్డి మహిళలకు ఆరోగ్య సంబంధిత అవగాహన కల్పించి, అవసరమైన చికిత్సలు అందించారు. అలాగే ప్రజలకు అత్యవసర వైద్య సేవల ప్రక్రియ (CPR) పై ప్రాయోగిక అవగాహన కల్పించి, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో వివరించారు. అదే విధంగా పుష్పగిరి ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా, బీపీ, షుగర్, రక్త పరీక్షలు, ఉచిత మందుల పంపిణీతో పాటు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పండుగ ఆనందంతో పాటు సేవా తృప్తిని పంచిన ఈ “మన సంక్రాంతి– మన పల్లె సేవ” కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 250 మందికి వైద్య చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధ్యాపకులు గురు బ్రహ్మయ్య, నాగ మునిరెడ్డి, తిమ్మారెడ్డి తో పాటు కేవీ సుబ్బారెడ్డి డిఈటి విద్యార్థులు పాల్గొన్నారు.

0
163 views