logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కుల వివక్ష నిర్మూలనకు దిశగా నర్సంపల్లి గ్రామంలో బుధవారం సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం

తేది:01.04.2026 కామారెడ్డి జిల్లా బుధవారం

కుల వివక్ష నిర్మూలనకు దిశగా నర్సంపల్లి గ్రామంలో బుధవారం సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలోని దళితులకు అన్ని దేవాలయాలలో ప్రవేశం కల్పించడం, సహపంక్తి భోజనాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఈ సందర్భంలో చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ రవి, డీటీడివో సౌజన్య, తహసిల్దార్ హిమబిందు, ఇతర సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. ..
కార్యక్రమం ప్రారంభంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రతిపాదించిందని, సమాజంలో కులాల ఆధారంగా ఉన్న వివక్షలు, విభేదాలు పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో జీవించే సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షను నిర్మూలించడానికి ప్రభుత్వం, అధికారులు ,ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేవాలయాలు, సామాజిక కార్యక్రమాలు, పండుగలు వంటి అన్ని వేదికలలో ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కుల వివక్ష లేదా దళితులపై ఏ విధమైన అన్యాయం జరిగినా, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సమానత్వం, సామాజిక న్యాయం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో సామాజిక ఐక్యత పెంపొందించుకోవాలని అన్నారు. ... తదుపరి అదనపు కలెక్టర్, అధికారులు, ప్రజలు కలిసి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం, శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలోకి అన్ని వర్గాల ప్రజలు కలిసి ప్రవేశించడం ద్వారా సామాజిక సమానత్వానికి ప్రాతినిధ్యం వహించారు.
అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు నిర్వహించడం ద్వారా కుల వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశం పంపించారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించింది.
కార్యక్రమం విజయవంతం కావడంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, అధికారులు సమన్వయంతో కృషి చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

23
1321 views

Comment