మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటమే జార్జ్ రెడ్డికి ఘన నివాళి
ఖమ్మం, 14.04.2026
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, పూర్వ మరియు ప్రస్తుత పీడీఎస్ యూ నాయకుల సమక్షంలో విప్లవ విద్యార్థి నాయకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పి డి ఎస్ యూ ఉమ్మడి రాష్ట్ర మాజీఅధ్యక్షులు అశోక్ కుమార్ మాజీజిల్లా నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, “జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్ నా సీఖో” అంటూ నినదిస్తూ, శాస్త్రీయ భావజాలంతో మతోన్మాద చీకట్లను పారద్రోలేందుకు పోరాడిన జార్జ్ రెడ్డి విద్యార్థి ఉద్యమాలకు చిరస్థాయి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
1972 ఏప్రిల్ 14న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మతోన్మాద శక్తుల దాడిలో అమరుడైన జార్జ్ రెడ్డి మరణించి 54 సంవత్సరాలు గడిచినా, ఆయన ఆలోచనలు, పోరాట స్ఫూర్తి ఇప్పటికీ విద్యార్థులలో సజీవంగా ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ప్రజలను కుల, మతాల పేరుతో విభజిస్తూ, హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తూ, విద్యా రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. జాతీయ విద్యావిధానం పేరిట ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జార్జ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ, శాస్త్రీయ విద్యావిధానం కోసం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లో మత ఆధారిత విద్వేషాలను ఎదుర్కొంటూ, సమానత్వం కోసం పోరాటాలు మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ పి డి ఎస్ యూ నాయకులు శిరోమణి ఝాన్సీ వెంగల్ రావు మల్లయ్య, నాగేశ్వర్రావు , కొటేశ్వర్ రావు పి డి ఎస్ యూ మాజీ నాయక లక్ష్మి ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ వెంకటేష్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ నగర అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ సహాయ కార్యదర్శి తిమ్మిడి రఘు జిల్లా నాయకులు శుశాంత్, నవీన్ సిద్దు,ప్రవీణ్ బాలు అభిలాష్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.