logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జనసేనలో అసమ్మతి జ్వాల పదవులు లేనిదే పెదవి విప్పం.

AIMA న్యూస్ బ్యూరో..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరాలు గడుస్తున్నా, జనసేన పార్టీలో మాత్రం ఒక రకమైన రాజకీయ స్తబ్దత ఆవరించింది. ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో అద్భుత విజయాన్ని అందుకున్న జనసేన, అధికారంలోకి వచ్చాక తన కేడర్‌కు తగిన గుర్తింపు ఇవ్వడంలో వెనుకబడిందా? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఇప్పుడు పదవులు లేక. గుర్తింపు రాక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
రాజకీయాల్లో ఏ విమర్శ చేయాలన్నా, ఏ సమస్యపై పోరాడాలన్నా చేతిలో ఒక 'పదవి' లేదా 'అధికారిక హోదా' ఉండాలి. పదవి ఉన్నప్పుడే ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు ఉంటుంది, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే బలం వస్తుంది. కానీ, ప్రస్తుతం జనసేన కార్యకర్తల పరిస్థితి 'ఆయుధం లేని పోరాటం'లా మారింది. ఏ పదవీ లేకుండా ప్రత్యర్థులను విమర్శిస్తుంటే. నీ హోదా ఏంటి? నీకు పార్టీ ఇచ్చిందేమిటి? అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇవ్వలేక, తమ ఆవేదనను వెళ్లగక్కలేక జనసైనికులు సతమతమవుతున్నారు.
కూటమి ధర్మం ప్రకారం అన్ని పార్టీలకు సమాన ప్రాధాన్యత ఉండాలి. కానీ, పరిస్థితి భిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తన కేడర్‌కు నామినేటెడ్ పదవులు, కమిటీల్లో, పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ దూసుకుపోతోంది. కానీ జనసేన విషయంలో మాత్రం ఇంకా 'వడపోత,'కసరత్తు' పేరుతో కాలయాపన జరుగుతోంది. కష్టపడి గెలిపించింది అందరం కలిసి అయినప్పుడు.ఫలాలు మాత్రం ఒకరికేనా? అని కార్యకర్తలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉండి కూడా సామాన్య కార్యకర్తల్లాగే మిగిలిపోతే, రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చే గౌరవం ఏంటని వారు ఆవేదన చెందుతున్నారు. పదేళ్లుగా పార్టీని నమ్ముకుని, ఆర్థికంగా, వ్యక్తిగతంగా నష్టపోయిన తమకు కనీస గుర్తింపు లేకపోతే అది కూటమి ధర్మానికే విరుద్ధమని కేడర్ భావిస్తోంది.
కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ చూసి ఓట్లు పడతాయని భావిస్తే సరిపోదు. ఆ ఇమేజ్‌ను ఓట్లుగా మార్చే కార్యకర్తలు బలంగా ఉండాలి. వారికి పదవుల ద్వారా రాజకీయ బలాన్ని ఇవ్వకపోతే, భవిష్యత్తులో వారు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం తగ్గిపోతుంది.కూటమిలో గౌరవం అంటే కేవలం నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత మాత్రమే కాదు. క్షేత్రస్థాయిలో జెండా మోసిన కార్యకర్తకు ఇచ్చే గుర్తింపు కూడా! ఇప్పటికైనా జనసేన అధిష్టానం మేల్కొని, కార్యకర్తలకు పదవుల ద్వారా 'అధికారిక అస్త్రాలు' అందించాలి. లేదంటే, ఈ అసంతృప్తి జ్వాలలు పార్టీకి కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉంది.

91
2931 views

Comment