logo

ప్రజల వద్దకే పాలన – కీసరలో ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నేతలు హాజరై గ్రామస్తుల నుంచి నేరుగా సమస్యలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సమస్య ప్రజలదైతే, పరిష్కారం ప్రభుత్వ బాధ్యత” అని స్పష్టం చేశారు. గ్రామంలో ఇళ్ల స్థలాల సమస్య తన దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్రంగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే స్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతామని హామీ ఇచ్చారు.
గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత పాలకుల కాలంలో తాగునీటి పనులకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, అప్పటి పాలకుల తప్పిదాల కారణంగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కావని, “సమస్య ఉన్న చోటే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉంటారు” అని భరోసా ఇచ్చారు. ప్రజా దర్బార్‌లో ప్రజలు వినిపించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే నమోదు చేసి, నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా పాలన ప్రజలకు మరింత దగ్గరైందని గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, కూటమి నేతలు, అధికారులు, మహిళలు, స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0
0 views