logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క ) త్వరలోనే 15 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం పోషణ్ పక్వాడ కార్యక్రమం ప్రారంభోత్సవం, అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆదివాసి సంప్రదాయమైన కొమ్ము నృత్యంతో స్వాగతం పలికిన అనంతరం మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాళ్లను సందర్శించి, అంగన్‌వాడీ సిబ్బంది తయారు చేసిన ఆహార పదార్థాలు, పిల్లలకు అర్థమయ్యే విధంగా రూపొందించిన విద్యా నమూనాలను పరిశీలించారు.

అనంతరం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. “బేటీ బచావో” పథకం కింద ఆడపిల్లల తల్లులకు హిమాలయ కిట్లను అందజేశారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోషకాహార కార్యక్రమాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ ద్వారా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పిల్లల బరువు, పోషకాహార వివరాలు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ విధానంలో నమోదు చేయడం ద్వారా పారదర్శకత, వేగం పెరుగుతాయని వివరించారు.

స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడిందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఓపెన్ టెండర్ విధానంలో కొనుగోలు చేపట్టగా ప్రారంభంలో సుమారు ₹14,000 వరకు ధరలు వచ్చినప్పటికీ పలు దఫాల టెండర్ ప్రక్రియ అనంతరం ఒక్కో ఫోన్‌ను ₹11,650కు పొందగలిగామని తెలిపారు. ప్రజల డబ్బు ఆదా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి సూచించారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం ₹9,000కు ఫోన్లు కొనుగోలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం చేపట్టిన పారదర్శక విధానంపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు.

ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో అంగన్‌వాడీలలో బ్రేక్‌ఫాస్ట్ పథకాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి 12 వేల భవనాలు మంజూరు చేయడం, మినీ కేంద్రాల అప్‌గ్రేడేషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు వంటి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇప్పటివరకు సుమారు ₹8 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జీవో విడుదలకు ముందే రిటైర్ అయిన వారికి కూడా ఈ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అంగన్‌వాడీ సిబ్బంది సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వేతనాల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అదేవిధంగా సుమారు 15 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంగన్‌వాడీ టీచర్లకు కేంద్ర ప్రభుత్వం కేవలం ₹2,800 మాత్రమే అందిస్తోందని, మిగతా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. జీతభత్యాల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 275 మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో నిపుణులు, అంగన్‌వాడీ టీచర్లతో కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చర్యలపై మేధోమథనం నిర్వహిస్తామని చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పోషకాహార లోపం లేని జిల్లా, బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ టీచర్లు పిల్లలను తమ సొంత పిల్లలుగా భావించి సేవలు అందించాలని సూచించారు.

*ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ* అంగన్‌వాడీ సిబ్బందికి స్మార్ట్‌ఫోన్‌లు అందించడం ద్వారా సేవల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ అంగన్‌వాడీ సేవలను ఆధునికీకరించడంలో ఈ కార్యక్రమం కీలకమని, కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.


అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ అంగన్‌వాడీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కీలకమని పేర్కొన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆధునిక సౌకర్యాలతో అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామని, చెండ్రుగొండ మండలం మద్దుకూరు కేరళ తరహాలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అన్ని కేంద్రాలకు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల విస్తరణతో సేవలు మరింత విస్తరించాయని తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బందికి జీతభత్యాలు పెంపు, సంక్షేమ చర్యలు మరింత విస్తరించాలని మంత్రి ని కోరారు.

*జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో* 1954 అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ చేయడం ద్వారా ఐసీడీఎస్ సేవలు మరింత సమర్థవంతంగా అమలు అవుతాయని తెలిపారు. డేటా సేకరణ, నివేదికల పంపిణీ, లబ్ధిదారుల వివరాల నిర్వహణ సులభతరం అవుతుందని చెప్పారు. జిల్లాలో మొత్తం 2061 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, అన్ని అంగన్వాడీ కేంద్రాలలో విద్యుదీకరణ పనులు పూర్తి చేశామని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు.197 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పిల్లల వివరాల నమోదు, పోషకాహారం పంపిణీ వంటి కార్యక్రమాల్లో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు .

అనంతరం మంత్రి చేతుల మీదుగా అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, జిల్లా అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

1
99 views

Comment